శంకరమంచి

సాహిత్యంలో హాస్యాన్ని విరబూయించిన శంకరమంచి 1946 నవంబరు 18 న మచిలీపట్నం (బందరు)లో జన్మించారు. మధ్యతరగతి నైరాశ్యాలను హాస్యంతో అధిగమించిన శంకరమంచి జీవనం ఆయన రచనల్లో ప్రతిబింబిస్తూంటుంది. కృష్ణాజిల్లా అవనిగడ్డ, విశ్వనాథపల్లి వీరి స్వగ్రామం. తల్లితండ్రుల ప్రేమాభిమానాల మధ్య పెరిగిన శంకరమంచికి తండ్రినుండి బాధ్యతాయుత జీవనం అలవర్చుకున్నారు. తండ్రి గారి పుస్తకపఠనాభిరుచి శంకరమంచికి సాహితీ ప్రపంచపు ద్వారాలను తెరచింది. విజయవాడ ఆంధ్ర లయోల కాలేజిలో B.Sc., చేసిన శంకరమంఛి అందులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.

మహామహులు ఆదుర్తి, అక్కినేనిల స్ఫూర్తి:

కాలేజీలో చదివే రోజుల్లో అక్కినేని నాగేశ్వర రావు నటన, ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వ ప్రతిభలు శంకరమంచిని విశేషంగా ఆకట్టుకున్నాయి. వారి అభిమానిగా మారిపోయారు. సునిశిత భావాలను అలవోకగా పలికించే అక్కినేని నటన, సున్నిత విషయాలను ప్రతిభావంతంగా తెరకెక్కించే ఆదుర్తి శైలి ఆయనకి ఇష్టపాత్రమైనాయి. ఒక కథని ప్రేక్షకుడి మనస్సుకి హత్తుకునేలా చెప్పడంలో ఆదుర్తి పద్దతులు, ఎత్తుగడలు, వెలుగు, నీడల్ని సన్నివేశాల్లో ప్రతిభావంతంగా ఉపయోగించడం వంటివి నిశితంగా గమనించేవారు శంకరమంచి. మూగమనసులు, ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయి లాంటి చిత్రాల్లో ఆదుర్తి చూపిన దర్శకత్వ వైదుష్యానికి స్ఫూర్తి పొంది తానూ దర్శకుడిని కావాలని నిశ్చయించుకున్నారు శంకరమంచి. ఒకసారి ఆదుర్తి సుబ్బారావుగారిని స్వయంగా కలసి దర్శకుడవుదామనుకుంటున్నానని చెప్పిన శంకరమంచితో దర్శకత్వమేమంత సులభసాధ్యం కాదన్నారాయన. ఒక సన్నివేశాన్ని ప్రేక్షకులకు ఎలా ప్రజంట్ చేయాలి అనే విషయంలో మహామహులు ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావుల నుండి స్పూర్తి పొందారు శంకరమంచి.

కుటుంబ బాధ్యతల్లో భాగంగా ఎ.జి. ఆఫీసు హైదరాబాదులో ఉద్యోగం చేపట్టవలసివచ్చింది. ఒకపక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరో పక్క రచనలు చేస్తున్న శంకరమంచికి ప్రముఖ హాస్యరచయిత ఆదివిష్ణు పరిచయమయ్యారు. ఆయన ప్రోత్సాహంతో ఉత్తేజం పొందిన శంకరమంచి విరివిగా కథలు రాయసాగారు. 1978లో ఆంధ్రజ్యోతి దీపావళి సంచిక కథల పోటీలో ప్రథమబహుమతి కైవసం చేసుకున్నారు. అప్పటినుండి 1985 వరకు కథారచయితగా విజృంభించారు. అన్ని పత్రికలకూ రాయసాగారు. వివిధ పత్రికల్లో అనేక బహుమతులు పొందారు. అభిమాన పాఠకలోకాన్నేర్పర్చుకున్నారు. నాలుగు కూడా నవలలు రాసారు. మిత్రుల సలహాతో నాటకరచయితగా మారిన 13 నాటికలు, 2 నాటకాలు రాసారు. ఇవన్నీ విశేష ప్రజాదరణ పొందాయి. రేడియో నాటికలు రాసారు. శంకరమంచి కలంనుండి జారువారిన రచనల్లో పలు టి.వి. సీరియల్స్ ఉన్నాయి. ఈ టి.వి., జెమిని టి.వి. దూరదర్శన్ లలో ఇవి వచ్చాయి. జెమిని టి.వి. లో వచ్చిన శంకరమంచి విరచిత "సీతారాముల సినిమాగోల" నంది అవార్డు కైవసం చేసుకుంది. ఈ టి.వి.లో ప్రసారమయిన "పోపుల పెట్టి" సీరియల్ కి హాస్యబ్రహ్మ జంధ్యాల దర్శకుడు కాగా శంకరమంచి రచయితగా పనిచేయడం విశేషం.

నాటకరంగంలోనుండి సినీరంగంలో అడుగిడిన శంకరమంచి మొత్తం 15 సినిమాలకు పనిచేసారు. అందులో పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. రేలంగి నరసింహారావు, వంశీ, జంధ్యాల, సింగీతం శ్రీనివాసరావు వంటి మహామహుల చిత్రాలకు రచనలందించారు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గోపి గోపికా, గోదావరి, సరదాగా కాసేపు, అప్పుచేసి పప్పుకూడు మొదలైన సినిమాలు శంకరమంచికి విజయవంతమైన సినీ రచయితగా పేరు తెచ్చిపెట్టాయి.


శంకరమంచిది ప్రేమ వివాహం. భార్య విజయలక్ష్మి. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక అబ్బాయి. కుమార్తెలు శాంతిప్రియ, భానురేఖ అమెరికాలో స్థిరపడ్డారు. అబ్బాయి రాజశేఖర్ సినిమారంగంలో దర్శకత్వశాఖలో కృషి చేస్తున్నారు.

పత్రికలు, నాటకరంగం, రేడియో, టి.వి., సినిమాల్లాంటి అన్ని మాధ్యమాలలో రచనలు చేసిన శంకరమంచి పలు అవార్డులు, పురస్కారాలు, బహుమతులు, సన్మానాలు అందుకున్నారు.


వీటిలో కొన్ని:

  • ఆంధ్రజ్యోతి, స్వాతి, ఉదయం తదితర పత్ర్రికల్లో కథలకి బహుమతులు
  • స్వాతి మాసపత్రికలో అనిల్ అవార్డు
  • రేడియో నాటికకు జాతీయ స్థాయిలో ప్రధమ బహుమతి
  • ఆంధ్రజ్యోతి నాటిక రచనల పోటీలో "పూజకు వేళాయెరా" కి ప్రధమ బహుమతి
  • ఆంధ్రజ్యోతి దీపావళి సంచిక కథల పోటీలో ప్రథమబహుమతి
  • అనేక నాటక పరిషతుల్లో ఉత్తమ రచయితగా బహుమతులు
  • విజయవాడ అభిరుచి సంస్థవారిచే జంధ్యాల స్మారక అవార్డు
  • సుమధుర కళానికేతన్ విజయవాడ వారిచే సత్కారం
  • జంధ్యాల మిత్రమండలి, హైదరాబాద్ వారిచే సత్కారం
  • జాలీ ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ వారిచే సన్మానం
  • రాగరాగిణి సంస్థవారి "పింగళి "అవార్డు
  • హాస్యరచయితగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి సత్కారం
  • జెమిని టి.వి. లో వచ్చిన శంకరమంచి విరచిత "సీతారాముల సినిమాగోల" నంది అవార్డు